మహా సరస్వతి శక్తి రూపిణే…

మహా సరస్వతి శక్తి రూపిణే…

వైభవంగా ప్రారంభమైన సామూహిక ఉచిత అక్షరాభ్యాసాలు..
ఇంద్రకీలాద్రిపై అక్షరాలు దిద్దిన చిన్నారులు..
250 మంది చిన్నారులతో ఆధ్యాత్మిక వాతావరణంలో మహోత్సవం..
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య…
అక్షరరూపం దాల్చిన చిన్నారుల భవిష్యత్తు
ఉచితంగా పలక, బలపం, పూజా సామగ్రి పంపిణీ
అక్షరాభ్యాసం అనంతరం కనకదుర్గమ్మ ప్రత్యేక దర్శనం.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ ఈవో శీనా నాయక్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో బుధవారం నిర్వహించిన సామూహిక ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమైంది. చిన్నారుల విద్యాభ్యాసానికి శ్రీకారం చుడుతూ నిర్వహించిన ఈ మహోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వేద పండితులు నిర్ణయించిన బుధవారం ఉదయం 8.06 గంటల శుభముహూర్తానికి మహామండపం ఆరో అంతస్తులో అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ సారథ్యంలో పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ చిన్నారుల చేత వారి తల్లిదండ్రులు ఓంకారంతో తొలి అక్షరాన్ని దిద్దించారు. ఆన్‌లైన్‌లో ముందస్తుగా నమోదు చేసుకున్న 250 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉదయం నుంచే మహామండపానికి చేరుకున్నారు.

రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించిన అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు. కార్యక్రమ నిర్వహణలో భాగంగా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు మాత్రమే ప్రవేశం కల్పించడంతో మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా, క్రమబద్ధంగా సాగింది. దేవస్థానం తరఫున చిన్నారులందరికీ పలక, బలపం, పూజా సామగ్రిని పూర్తిగా ఉచితంగా అందజేశారు. అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా కనకదుర్గమ్మ దర్శన భాగ్యం కల్పించారు.

దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. మహా సరస్వతి స్వరూపిణిగా భావించే కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు, సహకరించిన భక్తులకు ఈవో వీకే శీనా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.