దోపిడీ కేసు ను ఛేదించిన పోలీసులు…

దోపిడీ కేసు ను ఛేదించిన పోలీసులు…

కంచికచర్లలో భారీ బంగారం దోపిడీ..
అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు..
రూ 52 లక్షల రూపాయల విలువైన బంగారం.
సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు విజయవంతం..
నలుగురు దొంగలు అరెస్ట్..
నిందితులకు రిమాండ్..

కంచికచర్ల, ఆంధ్రప్రభ : నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల లో ఈ నెల 4వ తేదీన జరిగిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి, భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీపీ శ్రీనివాస్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కంచికచర్ల పరిధిలోని పరిటాల గ్రామంలో ఓ ఇంట్లో రాత్రి సమయంలో దోపిడీ జరిగింది. బాధితులు నిద్రలో ఉన్న సమయంలో దొంగలు వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. వంటగది మార్గాన్ని ఉపయోగించి లోపలికి చేరుకున్న నిందితులు బెడ్‌రూమ్‌లో ఉన్న దంపతులు నిద్రలో ఉండగానే అలమారాలు, కబోర్డ్స్‌ను తెరిచారు.

అలమారాలో భద్రపరిచిన తాళాలు తీసుకుని బంగారం ఉన్న లాకర్‌ను తెరిచి 374 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాగ్‌లో వేసుకున్నారు. అలాగే రూ.50,000 నగదును కూడా తీసుకుని అదే మార్గంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో ఈ ఇంటిపై గత రెండు నెలల్లో కూడా దోపిడీకి ప్రయత్నాలు జరిగినట్లు తేలింది. అయితే అప్పట్లో సొత్తు లభించకపోవడంతో ఈసారి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు గుర్తించారు. నిందితులు హైవే సర్వీస్ రోడ్డును ఉపయోగించి గ్రామంలోకి ప్రవేశించి, అదే మార్గంలో తిరిగి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ప్రారంభంలో స్థానిక సీసీ కెమెరాలు పూర్తిగా సహకరించకపోయినా, హైవే పరిధిలోని సీసీ ఫుటేజ్ కీలక ఆధారంగా మారింది.

ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన వాహనాన్ని గుర్తించి, ఆ నెంబర్ ట్రేస్ ద్వారా వారి ఐడెంటిటీ నిర్ధారించారు. అనంతరం నిఘా ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ టీమ్స్ సహాయంతో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగింది. సీసీ కెమెరాల విశ్లేషణ, వాహన ట్రాకింగ్, మానవ నిఘా కలిపి నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.52 లక్షల విలువైన 374 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని తదుపరి విచారణ కోసం పోలీసులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో వై వి వి ఎల్ నాయుడు , ఎస్సై విశ్వనాథ్ సహా పోలీస్ సిబ్బంది సమన్వయంగా పని చేసి కేసును విజయవంతంగా ఛేదించినట్లు ఆయన పేర్కొన్నారు.