Temple | వసంత పంచమికి ఏర్పాట్లు..

Temple | వసంత పంచమికి ఏర్పాట్లు..
- ఈ ఏడాది భక్తులకు ఉచిత దర్శనం
- పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం
Temple | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల పుణ్యక్షేత్రమైన దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతీ క్షేత్రంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న వసంత పంచమి మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, శ్రీశైలదేవస్థాన కార్యనిర్వాహణాధికారి యం. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.
గతంలో దర్శనానికి రూ. 5/-లు రుసుముగా ఉండేదన్నారు. ఈ సంవత్సరం భక్తులందరికీ కూడా ఉచిత దర్శనాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం సహాయకార్యనిర్వహణాధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా పలువురు దేవస్థానం అధికారులకు, సిబ్బందికి కూడా ఉత్సవాల ప్రత్యేక విధులను కేటాయించడం జరిగిందన్నారు.
ఉత్సవ నిర్వహణకు గాను ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారు కూడా తహశీల్దార్లకు, డిప్యూటీ తహశీల్దార్లకు, ఇతర రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారన్నారు. అదేవిధంగా ఆత్మకూరు డి.ఎస్.పి ఆధ్వర్యములో రద్దీక్రమబద్దీకరణ, వాహనాల క్రమబద్దీకరణ, భద్రతా చర్యలు చేపట్టబడుతున్నాయన్నారు.
ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు మంచినీటి సదుపాయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. కొత్తపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు వారి సిబ్బంది పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. గోకవరం మండల ప్రాథమిక కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దాత సహకారంతో దేవస్థానం భక్తులకు ఉచితంగా అన్నప్రసాదవితరణను చేయడం జరుగుతోందన్నారు. ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు. అన్నప్రసాదవితరణకు సంబంధించి దేవస్థానం దాతకు సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తోందన్నారు.
భక్తులు సౌకర్యవంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రణాళికబద్ధంగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు తాగునీరు అందించేందుకు కూడా ఆయా ఏర్పాట్లు చేయబడ్డాయన్నారు. వాహనాలరద్దీకనుగుణంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయబడుతున్నాయన్నారు. పారిశుధ్యం నిర్వహణకు తగు చర్యలు తీసుకోబడుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించే విధంగా పారిశుద్య సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.
వసంతపంచమి రోజున ఉదయం 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి ప్రాత:కాల పూజాదికాలు జరుగుతాయన్నారు. వేకువజామున ఉదయం గం. 5.20లకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించబడుతాయన్నారు. ఉదయం 6గంటల నుంచి భక్తులకు దర్శనాలు, సామూహిక అక్షరాభాస్యాలు జరిపించబడుతాయన్నారు. మధ్యాహ్నం గం.11.15లకు అమ్మవారి మధ్యాహ్నకాలపూజలు జరిపించబడుతాయన్నారు. తరువాత దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. సాయంకాలం 6గంటలకు ప్రదోషకాల పూజలు, నివేదన, మహామంగళహారతుల అనంతరం రాత్రి 7గంటలకు ఆలయ ద్వారాలు మూసివేయబడుతాయన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొలనుభారతిక్షేత్ర పరిసరాలలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం జరిగిందన్నారు. కాబట్టి భక్తుల ఈ విషయంపై దేవస్థానానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.
