30-year | పొలాల మధ్య భావోద్వేగ సమావేశం..

30 ఏళ్ల కల నెరవేరుస్తున్నందుకు రైతుల కృతజ్ఞతలు
ఆర్‌అండ్‌ఆర్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాసితులు..
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోరిన రైతులు

30-year | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పొలాల మధ్య జరిగిన ఈ సమావేశం భావోద్వేగభరిత వాతావరణంలో సాగింది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలకు చెందిన రైతులు, నిర్వాసితులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు, అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో పలువురు రైతులు మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుండటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. “30 ఏళ్ల మా కల నెరవేరుతోంది” అంటూ కొందరు రైతులు కంటతడి పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రాజెక్టు పూర్తయితే తమ ప్రాంత భవిష్యత్తు మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెలిగొండ నిర్వాసితులు కూడా ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్) ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. నిర్వాసిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపుతున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

అదే సమయంలో, ప్రాజెక్టు ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేందుకు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రైతులు ముఖ్యమంత్రిని కోరారు. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వారు అభిప్రాయపడ్డారు. రైతుల అభిప్రాయాలను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి, వారి సమస్యలు, అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.