Telangana Water Crisis | శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి సంక్షోభం
Telangana Water Crisis | శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి సంక్షోభం
Telangana Water Crisis | తెలంగాణలో పెరుగుతున్న తాగునీటి ఆందోళన
డెడ్ స్టోరేజీకి చేరుకున్న ప్రధాన జలాశయాలు
రైతాంగాన్ని వెంటాడుతున్న సాగునీటి కష్టాలు
వర్షాలు లేకపోతే మరింత తీవ్రతరం కానున్న పరిస్థితి
Telangana Water Crisis | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తాగు, సాగునీటి కష్టాలను తీర్చే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు అడుగంటాయి. డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో కృష్ణమ్మ వెలవెలబోతోంది. శ్రీశైలం గరిష్ట సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39.2 టీఎంసీలకు పరిమితమైంది. శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 810 అడుగులకు చేరువలో ఉంది.
అలాగే తాగు, సాగునీటికి వెన్నెముకగా ఉన్న నాగార్జునసాగర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. జలాశయం గరిష్ట సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 157.4 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ 510 అడుగుల చేరువలో ఉంది.
జలాశయాల్లో నీరు అడుగంటినప్పటికీ అత్యవసరంగా తాగునీటి దాహం తీర్చేందుకు ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీలను కృష్ణా నది యాజమాన్యం కేటాయించింది. రెండు ప్రధాన జలాశయాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెదక్ జిల్లా రైతాంగానికి సాగు, తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సింగూరు కింద క్రాప్ హాలీడే ప్రకటించగా, ముందస్తుగా వేసిన యాసంగి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన రిజర్వాయర్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. జలాశయాల్లో నీటిని నింపకపోవడంతో కొన్ని రిజర్వాయర్లు అడుగంటాయి. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను నింపి రైతుల పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణలో 2.72 టీఎంసీలు, రంగనాయకసాగర్‌లో 0.8 టీఎంసీలు, మల్లన్నసాగర్‌లో 7.897 టీఎంసీల నీరు ఉంది. మరికొద్దిరోజుల్లోనే ఈ నీరంతా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 0.44 టీఎంసీలకే పరిమితమైంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మానేరు, కడెం, కొమురం, సీతమ్మసాగర్, దుమ్ముగూడెం, ఇచ్చంపల్లి, స్వర్ణ, సదర్‌మాట్, పోచారం తదితర జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.
దక్షిణ భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే నీటి ఎద్దడి అధికంగా ఉంది. దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో 40 నుంచి 50 శాతం జలాశయాల్లో నీటి నిల్వలు ఉండగా, తెలంగాణలో 25 నుంచి 36 శాతం వరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది.
