భోగాపురంతో మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు..
- ఒడిశా, ఛత్తీస్గఢ్లకూ ఇది ‘గేమ్ చేంజర్’
- రేపు ప్రధాని చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం
- సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
భోగాపురం, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి మైలురాయిగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని ఒకవైపు ఉత్తరాంధ్ర భవిష్యత్తు, మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు సైతం ఈ ప్రాజెక్టు నిజమైన ‘గేమ్ చేంజర్’గా మారనుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శుక్రవారం విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శనివారం జరగనున్న ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది ప్రజలు తరలివస్తున్నారని మంత్రి తెలిపారు.
గడచిన మూడు రోజులుగా మంత్రులమంతా ఇక్కడే ఉండి ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో ప్రజలందరికీ వీక్షణ సౌకర్యం కోసం 50 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశామని, భోజన సదుపాయాలతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ పెద్ద ఎత్తున పారిశుధ్య సిబ్బందిని నియమించామని వెల్లడించారు. ఈ వేడుకకు తరలివచ్చేందుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, వాహనాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని తెలిపారు. నాయకులు సైతం స్వచ్ఛందంగా రవాణా సౌకర్యాలను సమకూరుస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్థిక విప్లవానికి బాటలు..
ప్రాంతీయ సామాజిక, ఆర్థిక పరిస్థితులను మూలమట్టంగా మార్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘదర్శిత్వంతో అడుగులు వేస్తున్నారని మంత్రి కొనియాడారు. “ఇక్కడ 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్ అందుబాటులోకి వస్తోంది. ఆక్వా, హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నాం. స్థానిక యువత వలసలను నివారించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఎవరు ఎంత కడుపుమంటతో విమర్శలు చేసినా, ముఖ్యమంత్రి విజన్ ముందు అవన్నీ కొట్టుకుపోక తప్పవు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం..
పెట్టుబడిదారులకు పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తూ, భారీగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నామని పార్థసారథి తెలిపారు. “గతంలోనే ఐటీ హిల్స్ అభివృద్ధికి పునాది వేశాం. భోగాపురం ప్రాజెక్టు ఘనత పూర్తిగా మా ప్రభుత్వానిదే. అనుమతులు, టెండర్లు, శంకుస్థాపన అన్నీ మేమే చేశాం. గత ఐదేళ్ల పాలనలో ఈ అభివృద్ధిని అటకెక్కించారు. కానీ, మేము అధికారంలోకి వచ్చాక పనులను పరుగులు పెట్టిస్తున్నాం. విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండే కనెక్టివిటీ రోడ్ల పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు.
