కర్నూల్ లో ఓ హత్య కేసు సంచలనం..

కర్నూల్ లో ఓ హత్య కేసు సంచలనం..

కుమారుడు కనిపించడం లేదని హైకోర్టుని ఆశ్రయం
హైకోర్టు ఆదేశాలతో బయటపడిన హత్య గుట్టు
వివాహేతర సంబంధం బయట పడుతుందని హత్య
మిస్సింగ్ కేసు నుంచి లాకప్ డెత్ వరకు
సిట్ విచారణలో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు
హత్య గుట్టు రట్టయినా… మృతి మిస్టరీ వీడేనా?
కౌతాళం కేసులో కొత్త అనుమానాలు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ ; కన్నకొడుకు అదృశ్యమయ్యాడంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లి.. ఆ తర్వాత అదే కొడుకు ఆచూకీ కోసం హైకోర్టు తలుపుతట్టిన తల్లి.. చివరకు తనే కొడుకు హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా తేలడం.. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం.. ఇప్పుడు ఆమె మరణం లాకప్ డెత్ కాదా అనే ప్రశ్నలు తలెత్తడం.. కర్నూలు జిల్లా కౌతాళంలో వెలుగుచూసిన ఈ కేసు నేర చరిత్రలోనే అత్యంత సంచలనాత్మక ఘటనగా మారింది.

ఒక మిస్సింగ్ కేసుగా ప్రారంభమైన ఈ వ్యవహారం.. వివాహేతర సంబంధం, పథకం ప్రకారం హత్య, హైకోర్టు జోక్యం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎంట్రీ, చివరకు ప్రధాన నిందితురాలి అనుమానాస్పద మృతి వరకు అనేక మలుపులు తిరిగి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

మిస్సింగ్ కేసు వెనుక హత్య రహస్యం

ఆదోని మండలం జి.హోసళ్లి గ్రామానికి చెందిన మాల గంగమ్మ తన కుమారుడు వీరేంద్ర కనిపించడం లేదంటూ 2024 నవంబర్‌లో కౌతాళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు ఆశించిన స్థాయిలో జరగలేదనే ఆరోపణలు వచ్చాయి. తన కుమారుడిని వెతకడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గంగమ్మ హైకోర్టును ఆశ్రయించడం కేసును కీలక మలుపు తిప్పింది. హైకోర్టు తీవ్రంగా స్పందించి సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.

సిట్ రంగప్రవేశంతో వెలుగులోకి వచ్చిన అసలు కథ

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, స్థానికుల వాంగ్మూలాలు, కుటుంబ సభ్యుల సమాచారాన్ని విశ్లేషించిన సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.విచారణలో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. భర్త మరణానంతరం గంగమ్మకు సమీప బంధువు బేగారి దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది. ఈ సంబంధాన్ని కుమారుడు వీరేంద్ర తీవ్రంగా వ్యతిరేకించాడని, పలుమార్లు తల్లిని ప్రశ్నించాడని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో కుమారుడు అడ్డుగా ఉన్నాడనే కారణంతో గంగమ్మ, దర్గప్ప కలిసి అతన్ని హత్య చేసినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

హత్య చేసి.. ఆచూకీ కోసం పోరాటం

దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, వీరేంద్రను ఇంట్లోనే కత్తితో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పూడ్చిపెట్టినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడే ఈ కేసు అత్యంత సంచలనాత్మకంగా మారింది. కొడుకుని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే తల్లి.. తర్వాత అతని ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించడం, ఆపై హైకోర్టుకు వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

మృతదేహం వెలికితీతతో సంచలనం

సిట్ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా జి.హోసళ్లి గ్రామ శ్మశానవాటికలో తవ్వకాలు చేపట్టారు. ఏడాదిన్నర కాలంగా పూడ్చిపెట్టిన మృతదేహాన్ని ఇటీవలే వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.మృతదేహం బయటపడటంతో వీరేంద్ర హత్య కేసు అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

అక్కడే మొదలైన కొత్త వివాదం

వీరేంద్ర హత్య కేసు ఛేదనకు చేరువవుతున్న సమయంలోనే గంగమ్మ అనూహ్యంగా మరణించడం మరో వివాదానికి దారితీసింది. పోలీసుల కథనం ప్రకారం గంగమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో వాదన ప్రకారం ఆమె ఇంట్లో బాత్రూంలో కాలుజారి పడటంతో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కొందరు హక్కుల సంఘాల ప్రతినిధులు మాత్రం ఈ వివరణలను ప్రశ్నిస్తున్నారు.

లాకప్ డెత్ అనుమానాలు

సిట్ విచారణలో భాగంగా గంగమ్మను తీవ్రంగా ప్రశ్నించారని, విచారణ సమయంలో శారీరకంగా హింసించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ హింస కారణంగానే ఆమె ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని కొందరు ఆరోపిస్తున్నారు. గంగమ్మ మృతి అనంతరం వేగంగా అంత్యక్రియలు నిర్వహించడం, పోస్టుమార్టంపై స్పష్టత లేకపోవడం, ఆమె కుమార్తె నుంచి తీసుకున్న వాంగ్మూలంపై వస్తున్న ఆరోపణలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.అయితే ఈ ఆరోపణలను పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ఆమె అనారోగ్యంతోనే మృతి చెందినట్లు చెబుతున్నారు.

సమాధానం లేని ప్రశ్నలు

ఈ కేసులో ప్రస్తుతం పలు ప్రశ్నలు సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో గంగమ్మ మరణానికి అసలు కారణం ఏమిటి? సిట్ విచారణలో ఆమెపై ఒత్తిడి లేదా హింస జరిగిందా? వీటిపై పోస్టుమార్టం నివేదిక ఏమి చెబుతోంది, ఆమె మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలాలు ఏమిటి,లాకప్ డెత్ ఆరోపణల్లో నిజమెంత, ఇలా ఎన్నో బేతాళ ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రాకముందే కేసు చుట్టూ అనుమానాల మేఘాలు కమ్ముకున్నాయి.

క్రైమ్ స్టోరీలో అరుదైన మలుపు

కొడుకు అదృశ్యంపై తల్లే ఫిర్యాదు చేయడం… అదే తల్లి హైకోర్టు వరకు వెళ్లడం… కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరగడం… చివరకు ఆమెనే హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా తేలడం… ఆపై విచారణ మధ్యలోనే ఆమె మరణించడం… ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే కౌతాళం ఘటన సాధారణ హత్య కేసు కాకుండా, అనేక ప్రశ్నలు, అనుమానాలు, సంచలన మలుపులతో కూడిన అరుదైన క్రైమ్ మిస్టరీగా మారింది. ప్రస్తుతం వీరేంద్ర హత్య కేసుతో పాటు గంగమ్మ మరణంపై కూడా పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply