Telangana Solar Power | మహిళా సంఘాలతో సౌర విద్యుత్ విప్లవం

Telangana Solar Power | మహిళా సంఘాలతో సౌర విద్యుత్ విప్లవం

Telangana Solar Power | నాలుగు జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ప్రారంభం
మహిళలకు స్థిర ఆదాయం కల్పించే ప్రాజెక్టు
ప్రభుత్వ మద్దతుతో మహిళల ఎనర్జీ రంగ ప్రవేశం
క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ లక్ష్యం

Telangana Solar Power | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మహిళా సాధికారత సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. నిన్నటి దాకా పొదుపు సంఘాలకే పరిమితమైన మహిళలు, నేడు రాష్ట్ర ఇంధన రంగాన్ని శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు కొమరం భీమ్ ఆసిఫాబాద్, ఖమ్మం, వికారాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈ సౌర విద్యుత్ కేంద్రాలను జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మహిళలను సంపద సృష్టికర్తలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తొలి విడతలో నాలుగు జిల్లాల్లో ప్లాంట్లు పూర్తి కావడంతో మహిళా సంఘాలు గ్రిడ్ యజమానులుగా కొత్త అవతారం ఎత్తబోతున్నాయి. వీటి తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలే కొనుగోలు

దేశంలోనే తొలిసారిగా గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ ప్లాంట్ల యాజమాన్య హక్కులను సామాన్య గ్రామీణ మహిళలకు కట్టబెడుతూ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కల్లూరు, మణుగూరు ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు ట్రయల్ రన్స్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ సహకారంతో మహిళా సంఘాల సభ్యులకు ప్లాంట్ల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళా సంఘాలకు నిలకడైన ఆదాయం లభించనుంది.

సంఘాలు ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తును ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలే (డిస్కంలు) కొనుగోలు చేస్తాయి. దీనివల్ల నెలకు లక్షల్లో ఆదాయం నేరుగా మహిళా సంఘాల ఖాతాల్లోకి చేరుతుంది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమిని కేటాయించడంతో పాటు, బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం అందించింది.

క్లీన్ ఎనర్జీ హబ్‌గా తెలంగాణ

ఇప్పటికే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణలో తమ సత్తా చాటిన తెలంగాణ మహిళలు, ఇప్పుడు అత్యంత సాంకేతికతతో కూడిన ఎనర్జీ సెక్టార్‌లోకి ప్రవేశించడం విశేషం. ఈ సౌర విప్లవం కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ అని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణను క్లీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) హబ్‌గా మార్చడంలో మహిళలు కీలక పాత్ర పోషించబోతున్నారు.

మహిళలే యజమానులుగా, మహిళలే నిర్వాహకులుగా సాగనున్న ఈ వినూత్న ప్రయోగం రానున్న రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని ప్రభుత్వం భావిస్తోంది.

Leave a Reply