Telangana Weather Update | తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం

Telangana Weather Update | తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం
Telangana Weather Update | రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్ష సూచన
ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
వడదెబ్బపై ప్రజలకు హెచ్చరికలు
Telangana Weather Update | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని ఒకటి, రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా కేరళ తీరాన్ని తాకనున్నాయని, అక్కడి నుంచి నాలుగైదు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు: వాతావరణ శాఖ వెల్లడి
ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడుతున్నప్పటికీ, దీనికి అనుబంధంగా ఉన్న చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.
పగటి పూట ఉష్ణతీవ్రత పెరగడంతో పాటు రాత్రిపూట నమోదయ్యే కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సుమారు 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని పేర్కొంది. దీనివల్ల అసౌకర్యకరమైన వాతావరణ పరిస్థితులు, వేడిమి, ఉక్కపోత వంటి పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. ఎక్కువ జనసాంద్రత కలిగిన హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు.
ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబ్నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 41-44 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.
