మాచర్ల మున్సిపల్ డీలిమిటేషన్‌పై హైకోర్టులో రిట్..
- 31 నుంచి 36 వార్డుల పెంపుపై సవాల్
ఉమ్మడి గుంటూరు బ్యూరో ,ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) వ్యవహారం న్యాయస్థానం ముందుకు వెళ్లింది. మున్సిపల్ వార్డుల సంఖ్యను 31 నుంచి 36కు పెంచుతూ చేపట్టిన ప్రక్రియను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఈ రిట్ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.
మాచర్ల మున్సిపాలిటీలో గతంలో 31 వార్డులు ఉండగా, తాజాగా చేపట్టిన డీలిమిటేషన్‌లో వాటి సంఖ్యను 36కు పెంచారు. అయితే ఈ వార్డుల పునర్విభజన ప్రక్రియ చట్టబద్ధంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ జరిగిందా లేదా అనే అంశాలను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌లో డీలిమిటేషన్ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రజాభిప్రాయ సేకరణ, వార్డుల హద్దుల నిర్ణయం వంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదని పేర్కొన్నట్లు సమాచారం. వార్డుల పునర్విభజన అనేది కేవలం పరిపాలనా ప్రక్రియ మాత్రమే కాదని, ప్రజల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే కీలక అంశమని, అందువల్ల ఇది పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందని పిటిషనర్ వాదించినట్లు తెలిసింది.
మున్సిపల్ ఎన్నికలకు ముందు వార్డుల సంఖ్య, హద్దుల్లో మార్పులు చేయడం వల్ల ఓటర్ల ప్రాతినిధ్యం, ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని పిటిషన్‌లో ప్రస్తావించినట్లు సమాచారం. డీలిమిటేషన్ ప్రక్రియ చట్టబద్ధతను పరిశీలించి, ప్రజల హక్కులు, ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
గత మున్సిపల్ ఎన్నికల సమయంలో మాచర్ల మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులు ఉండగా, అప్పటి ఎన్నికల్లో అధికార వైసీపీ 31 వార్డుల్లోనూ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ రానున్న ఎన్నికలను నిలుపుదల చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, రాబోయే పురపాలక ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మాచర్ల డీలిమిటేషన్‌పై దాఖలైన రిట్ కీలకంగా మారింది. ఒకవేళ న్యాయస్థానం విచారణలో డీలిమిటేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు సమర్థించబడితే, ఎన్నికల షెడ్యూల్, వార్డుల ఖరారు వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది సనేపల్లి రామ్ లక్ష్మణ్ రెడ్డి ను సంప్రదించగా, మాచర్ల మున్సిపల్ వార్డుల డీలిమిటేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. డీలిమిటేషన్ ప్రక్రియ చట్టబద్ధత, న్యాయపరమైన అంశాలను హైకోర్టు పరిశీలించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
