పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేస్తాం
పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేస్తాం
ప్రతి బుధవారం యూనిట్, డివిజన్, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు
పటమట, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ రామచంద్రనగర్, ఆయుష్ ఆసుపత్రి క్యాంటీన్ రోడ్డులో ఆయన పర్యటించారు.
స్థానికంగా ఉన్న సమస్యలను నివాసితులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. అనంతరం గణేష్‌నగర్‌లోని కె.ఎస్. గ్రాండ్‌లో 3వ డివిజన్ క్లస్టర్స్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడులో క్లస్టర్స్ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు లక్షల సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా మహానాడును వీక్షించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు టెక్నాలజీపై అవగాహన పెంచుకున్నారని చెప్పారు.
హైబ్రిడ్ మహానాడు కొనసాగింపుగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర కమిటీ ప్రత్యేక పార్టీ ప్రణాళికను విడుదల చేసిందన్నారు. అందులో భాగంగా ప్రతి నెల మొదటి బుధవారం యూనిట్ కన్వీనర్ పరిధిలోని ఐదు బూత్ కమిటీల సభ్యులు సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయాలని సూచించారు. రెండో బుధవారం డివిజన్ స్థాయిలో, మూడో బుధవారం నియోజకవర్గ స్థాయిలో, నాలుగో బుధవారం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.
ఈ సమావేశాల ద్వారా స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు, పార్టీని మరింత పటిష్టం చేసుకునే అవకాశం లభిస్తుందని గద్దె రామమోహన్ అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాడి బాబూరావు, గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్, యలమంచిలి పండు, పాశం కృష్ణబాబు, జంగం సునీల్‌రాజు, గుంజా ఏసు, రాగాని సాయి, దాసరి రమేష్, గొల్లపల్లి శంకర్, దాసరి శంకర్, కొండపనేని శ్రీను, మల్లిపెద్ది ఝాన్సీ, అట్లూరి వసంత్, బంగారు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
