కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేది టీడీపీనే

విజయవాడ పశ్చిమలో ఘనంగా మహమ్మద్ నజీర్ సన్మానం

విజయవాడ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే పార్టీ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మహమ్మద్ నజీర్ పేర్కొన్నారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గణపతిరావు రోడ్డులో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆయన విచ్చేయగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు నజీర్‌కు శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ, తనకు పలు కీలక పదవులు అప్పగించి గౌరవించిన తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అమరావతి అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడేనని కొనియాడారు. పదవులు అవకాశాల ప్రకారమే వస్తాయని, కార్యకర్తలు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆషా, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు షేక్ నరసింహ, ప్రధాన కార్యదర్శి పితాని పద్మ, నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు తమీం అన్సార్, ఎస్సీ సెల్ అధ్యక్షురాలు సుభాషిణి, కనకదుర్గ దేవస్థానం డైరెక్టర్ సుఖాసి సరిత, క్లస్టర్ ఇన్‌చార్జి ధనేకుల సుబ్బారావు, సయ్యద్ కరీముల్లా, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.