జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పిస్తాం

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పిస్తాం

తగిన మార్గదర్శకాలు తయారు చేస్తున్నాం
విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం
ఏపీయూడబ్ల్యూజే నేతలకు కలెక్టర్ లక్ష్మీశా హామీ

విజయవాడ, ఆంధ్రప్రభ : వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా హామీ ఇచ్చారు. ఈ మేరకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీయూడబ్ల్యూజే , విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మిశా ను సోమవారం నాడు కలెక్టరేట్ లో కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. గతంలో కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించిన విషయాన్ని కలెక్టర్ కు గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని, అంత మేర జర్నలిస్టులు చెల్లించుకునే పరిస్థితుల్లో లేరని కలెక్టర్ వివరించారు. గతంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజు రాయితీని అమలు చేయలేదని, ఈసారి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీని అమలు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ కు యూనియన్ నాయకులు విన్నవించారు. దీనిపైన స్పందించిన కలెక్టర్ ఈ సారి తప్పకుండా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్, ఉపాధ్యక్షులు చావా రవి, విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.రమణారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.రఘురామ్ తదితరులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు.