సూర్యాపేటకు రైల్వే లైన్ సాధించేదాకా పోరాటం: రైల్వే సాధన సమితి
సూర్యాపేట, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లాకు రైల్వే లైన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరిదిద్దాలని సూర్యాపేట రైల్వే సాధన సమితి డిమాండ్ చేసింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి కన్వీనర్ డేగల జనార్దన్, కో-కన్వీనర్ రాచురి ప్రతాప్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రంగా రెడ్డి, గౌరవ సలహాదారు లింగంపల్లి భద్రయ్య మాట్లాడారు. తొలుత ప్రతిపాదించిన హైదరాబాద్–సూర్యాపేట–ఖమ్మం రైల్వే మార్గాన్ని మార్చడం వల్ల జిల్లా ప్రజల ఆశలు దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట చారిత్రక, భౌగోళిక, వాణిజ్య పరంగా కీలకమైన జిల్లా కేంద్రంగా ఎదిగిందని, ప్రతిరోజూ పది మండలాల ప్రజలు విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రాధాన్యం ఉన్న జిల్లాకు ఇప్పటికీ రైల్వే సౌకర్యం లేకపోవడం అభివృద్ధికి తీవ్ర ఆటంకంగా మారిందన్నారు. రైల్వే లైన్ ఏర్పడితే విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రయాణ, సరుకు రవాణా పరంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాన్ని పునఃసమీక్షించి, మొదట ప్రకటించిన హైదరాబాద్–సూర్యాపేట–ఖమ్మం రైల్వే లైన్‌ను యథాతథంగా అమలు చేయాలని సమితి డిమాండ్ చేసింది. రైల్వే లైన్ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, సంతకాల సేకరణ, వినతిపత్రాల సమర్పణ, ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ప్రజాప్రతినిధుల ముట్టడులు వంటి ప్రజాస్వామ్య పోరాట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, రైతు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు, జిల్లా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరింది.
