పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: షబ్బీర్ అలీ
బిక్కనూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్‌లోని షబ్బీర్ అలీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, పార్టీ వ్యవహారాలపై ఇరువురు చర్చించారు. అలాగే ఇంద్రకరణ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న షబ్బీర్ అలీ, పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
రైతులకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని, ప్రస్తుతం ఎలాంటి కొరత లేదని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపిస్తూ, వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించి అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
