ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి.. తీవ్ర గాయాలు

బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియా కృష్ణమందిర్ రోడ్డులో గురువారం ఓ ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం గిరవెల్లి గ్రామానికి చెందిన విహాన్ గౌడ్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు బెల్లంపల్లి పట్టణానికి వచ్చాడు. కృష్ణమందిర్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఓ వీధి కుక్క బాలుడిపైకి దూసుకొచ్చి దాడి చేసింది.

ఈ దాడిలో బాలుడి మెడ, తొడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే కుక్కను తరిమికొట్టి, రక్తస్రావం అవుతున్న బాలుడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.కృష్ణమందిర్ ప్రాంతంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని, నిత్యం ఇక్కడికి వచ్చే వినియోగదారులు, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.