అర్ధరాత్రి హైవేలపై స్పెషల్ డ్రైవ్..

అర్ధరాత్రి హైవేలపై స్పెషల్ డ్రైవ్..
నంద్యాల, ఆంధ్రప్రభ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ లక్ష్యంగా ‘స్టాప్ – వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.
రాత్రి వేళల్లో, తెల్లవారుజామున నిద్రమత్తు కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వాహనాలను నిలిపివేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్లు ముఖాలు కడుక్కుని సేదతీరిన తర్వాతే వాహనాలను ముందుకు అనుమతిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కడప – నంద్యాల హైవే, కర్నూలు – విజయవాడ హైవే, నంద్యాల – కర్నూలు జాతీయ రహదారి నెంబర్ 44, కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్లే ప్రధాన రహదారులతో పాటు జిల్లాలోని కీలక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు పరిశీలిస్తూ డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే డ్రైవర్లు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని స్పష్టం చేశారు.
అతివేగం, రాంగ్ రూట్‌లో ప్రయాణం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్లు, వాహన యజమానులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరించారు. ప్రజల సురక్షిత ప్రయాణానికి వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని కోరారు.
