ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి పయ్యావుల

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఉరవకొండ పట్టణానికి చెందిన హనుమంతు కుమారుడు,6 నెలల వయసున్న చిన్నారి కుమ్మరి లోకేష్ అరుదైన ప్రైమరీ హీమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసిస్ ( హెచ్ ఎల్ హెచ్ ) వ్యాధితో బాధపడుతుండగా, చిన్నారి కుమ్మరి లోకేష్ చికిత్స కోసం ఇటీవల, కొద్దిరోజుల క్రితం చిన్నారి తల్లిదండ్రులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ని కలిసి ఆర్థిక సహాయం కోరింది.

కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, తక్షణమే స్పందించి 5 రోజుల క్రితం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకుని తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు. అనంతరం హైదరాబాద్‌లోని సింధు హాస్పిటల్ యాజమాన్యంతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి, చిన్నారికి ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యుత్తమ వైద్యం అందించాలని పయ్యావుల కేశవ్ కోరారు. మంత్రి ప్రత్యేక చొరవతో ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7.5 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది.

చెప్పినట్లుగానే.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.7,50,000 చెక్కును బుధవారం అనంతపురంలోని తన స్వగృహంలో చిన్నారి తల్లి కుమ్మర లత పేరుపై మంత్రి అందజేశారు. ఈ సహాయంతో చిన్నారి చికిత్సకు ఆర్థిక భారం కొంత తగ్గడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ కష్టకాలంలో వెంటనే స్పందించి తమ బిడ్డకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు చిన్నారి తల్లితండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.