KNL | హాస్టల్ లో జూనియర్స్ పై సీనియర్స్ దాడి.. ఆందోళనకు దిగిన బంధువులు

కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని ప్రీ మెట్రిక్ హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న కర్నూలు షరీఫ్ నగర్ కు చెందిన మహేష్ అనే విద్యార్థి తోటి ఏడు, ఎనిమిదో తరగతులు చదువుతున్న విద్యార్థులపై వారం క్రితం విచక్షణా రహితంగా దాడి చేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమ‌వుతుంది. కింది స్థాయి విద్యార్థులను ఇలా విచక్షణారహితంగా కొట్టడానికి గల కారణాలు ఏవైనప్పటికీ సంబంధిత బాధిత విద్యార్థులపై దాడి అమానుషం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్లో వసతి పొందుతున్న విద్యార్థుల రక్షణ బాధ్యతను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించే విధంగా, ఆయా హాస్టల్లో సంబంధిత అధికారులు రాత్రిపూట నిద్ర చేసే విధంగా జిల్లా కలెక్టర్ తగిన ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థి మహేష్ ప్రస్తుతం అక్కడే హాస్టల్ లో అడ్మిషన్ లేకుండా పాలకుర్తికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుల సిఫార్సుతో హాస్టల్ లోనే వసతి పొందుతూ తోటి విద్యార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సంబంధిత విద్యార్థి మహేష్ వేష భాషలు మిగతా విద్యార్థుల కన్నా భిన్నంగా ఉంటాయని తెలిసింది. అయితే గతవారం 7, 8వ తరగతి చదువుతున్న తోటి విద్యార్థులు తన మాటవినడం లేదని ఆ విద్యార్థులపై విచక్షణ రహితంగా బెల్టుతో, కాలుతో తన్నిన సంఘటన చోటుచేసుకుంది.

సంబంధిత హాస్టల్ కు ఇన్చార్జి వార్డెన్ గా వ్యవహరిస్తున్న రాముడికి ఈ విషయం చెబితే మీ గొంతు కోస్తానని మహేష్ బాధిత విద్యార్థులను బెదిరించాడని తెలిసింది. అయితే ఈ విషయం ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ ను సందర్శించినప్పుడు బయటికి తెలిసింది. దీంతో బాధిత బాలుర తల్లిదండ్రులు హాస్టల్ నిర్వాహకులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో విషయం బయటకు తెలిసింది.

పైన తెలిపిన వివరాలు పరిగణలోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం, రక్షణ కోసం జిల్లా కలెక్టర్ హోదాలో తమరు సమగ్ర విచారణ జరిపించి విద్యార్థులపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు సంబంధిత అధికారులకు జారీ చేయాలని, అవసరమైతే ఆయా సంబంధిత వార్డెన్లతో సమావేశం నిర్వహించి ప్రక్షాళన చర్యలు చేపట్టాలని రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పి.ఆనంద్ బాబుతో పాటు పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *