ఆదోని  ఆశలు.. ఆవిరి

జిల్లా హోదాకు దక్కని ప్రతిపాదన

 ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి అసంతృప్తి

కర్నూలు డివిజన్‌లో  డోన్​ విలీనం .. ఎంఎల్‌ఏ కోట్ల డిమాండ్‌

నవంబర్‌ 10 కేబినెట్‌ నిర్ణయం కీలకం

( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ):

రాష్ట్రంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు-, పేర్ల మార్పులు వంటి అంశాలపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ద్వారా సమగ్రంగా పరిశీలన జరిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉపసంఘం సమావేశమై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమర్పించిన వందలాది వినతులను చర్చించింది. నవంబర్‌ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నివేదికను ఆమోదం కోసం ఉంచనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జనగణనకు ముందుగానే పరిపాలనా పునర్విభజన పూర్తి చేయాలని సంకల్పించింది. నవంబర్‌లో కేబినెట్‌ ఆమోదం, డిసెంబర్‌ మధ్యన ప్రజల అభ్యంతరాల స్వీకరణ, గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలతో డిసెంబర్‌ 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు బావిస్తున్నాయి.

మంత్రుల ఉపసంఘం – విస్తృత సమీక్ష :

కొత్త జిల్లాల రూపకల్పనకు ప్రభుత్వం ఏర్పాటు- చేసిన ఏడుగురు మంత్రుల కమిటీ- ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పౌరసంఘాల నుంచి 200కుపైగా వినతులు స్వీకరించింది. జిల్లా వారీగా పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి స్థాయి, భౌగోళిక పరిస్థితులు, జనాభా సమతౌల్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సిఫార్సులు సిద్ధం చేసింది.అయితే ఈ నివేదికలో ఆదోని జిల్లా ప్రతిపాదన లేకపోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది.

ఆదోని ప్రజల్లో అసంతృప్తి :

కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు- చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదోని, హోళగుంద, ఆలూరు, పత్తికొండ మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు- చేయాలని పలుమార్లు వినతులు సమర్పించినా, ఈసారి కూడా ప్రభుత్వం మొండి చేయి చూపినట్లే కనిపిస్తోంది. స్థానిక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా అసెంబ్లీలోనే ఆదోని జిల్లాగా చేయకపోతే ప్రాణత్యాగాని-కై-నా సిద్ధం అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తాజా నివేదికలో ఈ ప్రతిపాదన లేకపోవడంతో అటు ప్రజా ప్రతినిధులు ఇటు ప్రజల్లో అసహనం రగిలిస్తోంది.

ఆదోనికి ఆర్థిక కష్టాలు

ఆదోని పట్టణ జనాభా 1.91 లక్షలు, గ్రామీణ జనాభా 1.18 లక్షలు కలిపి మొత్తం 3.10 లక్షలు. కానీ ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ పరిశ్రమలు లేవని చెప్పాలి. ఒకప్పుడు మూడు నూలు పరిశ్రమలు, అనేక చిన్న కార్ఖానాలు నడిచేవి. ఇప్పుడు అవన్నీ మూతపడి, వేలాదిమంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం రెండు ఆయిల్‌ మిల్లులు, కొద్దిపాటి పత్తి జిన్నింగ్‌ యూనిట్లు- మాత్రమే పనిచేస్తున్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారం. రైతులు పత్తి, వేరుశనగ, శనగ, మొక్కజొన్న, జొన్న పంటలను సాగు చేస్తున్నా – ప్రకృతి ఒడిదుడుకులు, వర్షాభావం కారణంగా ఏటా నష్టాలపాలవుతున్నారు. దీంతో వలసలు పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది.యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల నిరాశ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదోని జిల్లాగా మారితే అభివృద్ధికి ఊతమిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

పరిపాలనా లోటు-..

 –  

కర్నూలు జిల్లా విస్తీర్ణం పెద్దది. దూర ప్రాంతాల ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు అందడం కష్టమవుతోంది. ఆదోని, ఆలూరు, హోళగుంద మండలాల ప్రజలు చిన్న పనులకే కర్నూలు చేరాల్సి వస్తోంది. ఈ దూరం, ఆలస్యాలు, అభివృద్ధి వెనుకబాటు-తనం వంటి అంశాలే కొత్త జిల్లా అవసరాన్ని బలపరుస్తున్నాయి.స్థానిక ప్రజలు జిల్లా ఏర్పడితే పరిశ్రమలు తిరిగి వస్తాయి, రహదారి అభివృద్ధి, విద్యా సంస్థలు, వైద్య సేవలు మెరుగుపడతాయి అని ఆశిస్తున్నారు.

పెద్ద హరివనం .. మండలం వరం

కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటు- చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా పరిశీలిస్తోంది. ప్రజల చిరకాల డిమాండ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం పట్ల ఆసక్తి నెలకొంది.రాష్ట్రంలో పరిమితంగానే జిల్లా, డివిజన్‌, మండలాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టాలని ఉపసంఘం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో అఖిల భారత సర్వీసు అధికారుల కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రులు, వనరులను దృష్టిలో ఉంచుకొని మార్పులు జాగ్రత్తగా చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటు-తో పాటు-, డివిజన్ల విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచనలొచ్చినట్లు- సమాచారం. జగన్‌ ప్రభుత్వం చేసిన పునర్‌ వ్యవస్థీకరణలో ఉన్న లోపాలను సరిచేసే చర్యలు కూడా ప్రతిపాదనల్లో ఉన్నట్లు- తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పెద్దహరివానం మండలం ఏర్పాటు- చేయనున్నట్టు తెరమీదకు రావడం విశేషం.

ఆదోనికి వట్టి  ఆశలే..

2019 ఎన్నికల సమయంలో వైసీపీ, తెలుగు దేశం కూటమి నేతలిద్దరూ ఆదోనిని జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ తీరుతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు-గా ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్థానికులు అంటు-న్నారు.ఆదోని జిల్లా డిమాండ్‌ ఈసారి కూడా పక్కన పడితే, ప్రజా ఆవేదన మరింత పెరగడం ఖాయం. మొత్తంగా కొత్త జిల్లాల రూపకల్పనలో ఆదోని మరోసారి విస్మరించబడిందనే భావన గట్టిగా వినిపిస్తోంది. ఈనెల 10 న జరిగే కేబినెట్‌ భేటీ- – ఆదోని భవితవ్యానికి నిర్ణాయకంగా మారవచ్చు. ప్రజల అంచనాలు – పరిపాలనా నిర్ణయాలు – రెండింటి మధ్య సమతౌల్యం ఎలా సాధిస్తుందో చూడాలి.

కర్నూలులో విలీనంపై డోన్​ డిమాండ్​

ఆదోని జిల్లాగా ప్రకటించటమే కాదు, కర్నూలు జిల్లాలో  డోన్‌ నియోజక వర్గంలోని డోన్‌  పట్టణాన్ని  విలీనం చేయాలనే డిమాండ్‌ను స్దానిక ఎంఎల్‌ఏ కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి తెరమీదకు తెచ్చారు.నంద్యాల, కర్నూలు జిల్లాల బై వెరిఫికేషన్‌ ముందు కర్నూలు డివిజన్‌లోనే డోన్‌ ఉండేది. అయితే విభజన అనంతరం డోన్‌ను నంద్యాల జిల్లాలో విలీనం చేశారు. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కోట్ల ఈ డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు.

Leave a Reply