విద్యుత్ షాక్తో మూగజీవాలు మృతి.. రైతుకు రూ.లక్ష నష్టం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఐదు గొర్లు, రెండు మేకలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత రైతు భాషబోయిన నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం, తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో గొర్లు అరుస్తున్న శబ్దం వినిపించడంతో వెళ్లి చూడగా, షెడ్డు సమీపంలో గొర్లు, మేకలు మృతిచెంది కనిపించాయి. పరిశీలించగా షెడ్డు చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు ఆనుకుని అవి మృతి చెందినట్లు గుర్తించారు.
షెడ్డు పైభాగంలో ఉన్న విద్యుత్ తీగల నుంచి ప్రమాదవశాత్తు ఇనుప కంచెకు విద్యుత్ ప్రవహించడంతో పశువులు విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.లక్ష మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకుని పరిహారం అందించాలని బాధిత రైతు నర్సయ్య విజ్ఞప్తి చేశారు.
