Crude Oil Prices | చమురు మార్కెట్లలో మార్పులు
Crude Oil Prices | చమురు మార్కెట్లలో మార్పులు
Crude Oil Prices | హార్మూజ్ జలసంధి తెరవడంతో తగ్గుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు
భారత్‌కు ఊరట.. కానీ ఇంధన మార్కెట్లపై ఇంకా అనిశ్చితి
Crude Oil Prices | ముంబై: ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. రెండు రోజుల్లో ధరలు 2 శాతం తగ్గి మూడు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అదనంగా భౌతిక డిమాండ్ బలహీనపడటం కూడా ఇందుకు కలిసి వచ్చింది.
గోల్డ్‌మన్ సాక్స్ వంటి పలు ప్రధాన మార్కెట్ విశ్లేషకులు, కీలక బ్రోకరేజ్ సంస్థలు 2026 చివరి నాటికి ముడి చమురు ధరలు యుద్ధానికి ముందు స్థాయికి పడిపోతాయని అంచనా వేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 81 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. యూఎస్ ఆయిల్ కాంట్రాక్ట్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) 2.6 శాతం తగ్గి బ్యారెల్‌కు 78 డాలర్ల స్థాయిలో కోట్ చేయబడింది.
ప్రపంచ ఇంధన ప్రవాహాల్లో 20 శాతం హార్మూజ్ జలసంధి నుంచి రవాణా అవుతోంది. జూన్ 19 నుంచి హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో పాటు ఎల్‌ఎన్‌జీ ధరలు కూడా తగ్గుతున్నాయి.
అయితే సరఫరాల్లో అంతరాయాలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, నిల్వల కొరత వంటి కారణాలతో ఇంధన మార్కెట్లు నెలల తరబడి అస్థిరంగానే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రోజులుగా ఒప్పందం కుదురుతున్న వార్తలతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అప్పటి నుంచి ముడి చమురు ధరలు 20 శాతం తగ్గాయి. దీనితో పాటు ఎల్‌ఎన్‌జీ బెంచ్‌మార్క్ ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే అవకాశం ఉందన్న వార్తలతో ఇంధన మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ప్రమాద ప్రీమియంలో తీవ్ర తగ్గుదల నమోదైనట్లు క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ తెలిపారు.
కుదిరిన శాంతి
ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందంపై శుక్రవారం జెనీవాలో సంతకాలు జరగనున్నాయి. ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ముడి చమురు ధరలు సోమవారం 5 శాతం తగ్గాయి. ఫలితంగా ఆరు ప్రధాన కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ బలాన్ని సూచించే ఇండెక్స్ తగ్గింది.
చమురు వాణిజ్యం ప్రధానంగా డాలర్లలోనే సాగుతోంది. చమురు సరఫరాలు పెరిగితే డాలర్లకు ఉన్న సురక్షిత పెట్టుబడి డిమాండ్ తగ్గుతుంది. దీని వల్ల ముడి చమురు ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి తగ్గే అవకాశం ఉంటుంది. ముడి చమురు ధరలు తగ్గితే భారత్‌లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంది. అలాగే దేశ ఇంధన దిగుమతి బిల్లును తగ్గిస్తుంది. పశ్చిమాసియాలో రోజుకు దాదాపు 10-11 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. కొన్ని ఆయిల్ ప్లాంట్లు దాడుల్లో దెబ్బతిన్నాయి.
ఈ కారణాల వల్ల ముడి చమురు ధరలు సాధారణ స్థితికి వచ్చేందుకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట అభిప్రాయపడ్డారు. యుద్ధానికి ముందు బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్ల వద్ద ఉంది. చైనా కొనుగోళ్లను పెంచితే మాత్రం చమురు ధరలు తగ్గే అవకాశం తక్కువని చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఎల్‌ఎన్‌జీ ధరలు మాత్రం మరికొంత కాలం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
