జాతీయ రహదారి పక్కన అగ్నిప్రమాదం
జాతీయ రహదారి పక్కన అగ్నిప్రమాదం
10 ఎకరాల్లో వరికొయ్యలు దగ్ధం.. రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం
చిలుపూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ శివారు కొత్తపల్లి గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న పంట పొలంలో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వరికొయ్యలకు మంటలు అంటుకుని సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో గడ్డి దగ్ధమైంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న శైలేందర్ రెడ్డికి చెందిన 10 ఎకరాల వరి పంట స్థలంలో వరికొయ్యలకు మంటలు అంటుకుని, పొలం చుట్టూ వ్యాపించాయి. ఆ పంట పొలాన్ని కౌలుకు సాగు చేస్తున్న రైతుకు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు.
అదే ప్రాంతానికి సమీపంలో మైసయ్య అనే వ్యక్తి ఏర్పాటు చేసుకున్న నర్సరీ షెడ్ కూడా మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. మంటల కారణంగా జాతీయ రహదారిపై పొగ కమ్ముకోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరికొయ్యలను కాల్చవద్దని పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

