శ్రీశైలంలో యోగాంధ్ర సందడి..

జూన్ 8న భారీ యోగా కార్యక్రమం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో జూన్ 8వ తేదీన భారీ స్థాయిలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

శుక్రవారం వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రధాన కార్యక్రమానికి ముందుగా జూన్ 6, 7 తేదీలలో చంద్రవతి కల్యాణ మండపంలో యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

జాతీయ స్థాయిలో పేరొందిన యోగా గురువుల ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలు జరుగనున్నాయని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు పేర్కొన్నారు.

జూన్ 8న నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమం కోసం గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు యోగా నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని కూడా గంగాధర మండపం వద్దనే నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్థానిక ప్రజలు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.