ప్రత్యేక అవసరాల విద్యార్థులకు కిట్ల పంపిణీ
ప్రత్యేక అవసరాల విద్యార్థులకు కిట్ల పంపిణీ
- 284 మంది విద్యార్థులకు అందజేత
- సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కార్యక్రమం
- ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఏపీసీ రమేష్‌బాబు
- వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన
విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యా అవకాశాలు, అవసరమైన సదుపాయాలు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని ఎం.కే. బేగ్ హైస్కూల్లో ప్రత్యేక కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 284 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని కిట్లను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రమేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అభ్యున్నతికి సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని, విద్యతో పాటు అవసరమైన పరికరాలు, సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
సహిత విద్య సమన్వయకర్త నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సమగ్ర శిక్ష ద్వారా అందిస్తున్న వివిధ రకాల అలవెన్సులు, భవిత కేంద్రాల ద్వారా అందిస్తున్న విద్యా సేవలు, పునరావాస కార్యక్రమాలు, ఇతర సంక్షేమ పథకాల గురించి వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హుస్సేన్, జిల్లాలోని ప్రత్యేక ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగగా, విద్యార్థులకు అవసరమైన కిట్ల పంపిణీ విజయవంతంగా నిర్వహించారు.
