యోగాతో ఆనంద యోగం..
యోగాతో ఆనంద యోగం..
నిత్య యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం…
ప్రతిఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ ఆంధ్రప్రభ : సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తోందని.. యోగాతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని.. అందువల్ల ప్రతిఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్రలో భాగంగా బుధవారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిత్యయోగా కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరమని పేర్కొన్నారు.

యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమన్నారు. నిత్య యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని.. రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులకు యోగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచగా, ఉద్యోగులకు పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందని.. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు.కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పి.వాణి, సహాయ పౌరసరఫరాల అధికారి వి.శ్రీనివాసులు నాయుడు, ఆయుష్ అధికారి డా. వై.రత్నప్రియదర్శిని, డీఎస్డీవో కోటేశ్వరరావు, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డా. డి.చంద్రశేఖర్, డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
