ప్రతి మండలానికి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలి..

ప్రతి మండలానికి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలి..

  • మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు…

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు సూచించారు.

తిమ్మాపూర్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీజేపీ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ జిల్లా శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి మండలానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని మంజూరు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా మహిళలు, యువతకు తగిన ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మహిళలు సమాజంలో మరింత ముందంజలో నిలుస్తారని పేర్కొన్నారు. అలాగే యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండేందుకు కూడా ఈ కేంద్రాలు దోహదపడతాయని తెలిపారు.

ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి చేతివృత్తులు చేసే వారికి శిక్షణ, అవగాహన కల్పించాలని సూచించారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని అన్నారు.

యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, ప్రతి మండలంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని మరోసారి కోరారు.

తెలుగు భాషకు మరింత ప్రాధాన్యం కల్పించాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పంపకవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, వైస్ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply