IPL 2026 ప‌ర్పుల్ క్యాప్ కోసం ట‌ఫ్ ఫైట్ !

IPL 2026 ప‌ర్పుల్ క్యాప్ కోసం ట‌ఫ్ ఫైట్ !

ఐపీఎల్ 2026 మహా సంగ్రామం క్లైమాక్స్ సీన్‌కు వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), హోమ్ గ్రౌండ్‌లో సింహంలా గర్జించే గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య నేడు (మే 31) ఫైనల్ ఫైట్ జరగబోతోంది.

అయితే, ఈ మ్యాచ్ కేవలం ఐపీఎల్ ట్రోఫీ కోసమే కాదు.. ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచే ‘పర్పుల్ క్యాప్’ (Purple Cap) దక్కించుకోవడానికి కూడా ఇరు జట్ల బౌలర్ల మధ్య అసలైన యుద్ధం జరగబోతోంది.

రబడా వర్సెస్ భువీ..

బౌలింగ్ పిచ్‌లపై ఈ సీజన్ అంతా ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగారు. అద్భుతమైన ప్రదర్శనతో వికెట్ల వేట సాగించారు. ఇప్పుడు పర్పుల్ క్యాప్ కోసం గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ కాగిసో రబడా, ఆర్సీబీ స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ మధ్య ఓ రేంజ్ పోటీ నడుస్తోంది.

కాగిసో రబడా 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లతో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. మ‌రోవైపు 15 మ్యాచ్‌ల్లోనే 26 వికెట్లు తీసి రబడాకు గట్టి పోటీ ఇస్తున్నాడు ఆర్సీబీ బౌల‌ర్ బువ‌నేశ్వ‌ర్. ఇక‌ నేటి మ్యాచ్‌లో భువీ మరో 3 వికెట్లు తీస్తే పర్పుల్ క్యాప్ ఆర్సీబీ ఖాతాలోకి వెళ్తుంది.

ఆరెంజ్ క్యాప్ రేసులో గిల్, సాయి సుదర్శన్!

బ్యాటింగ్ విభాగంలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. అయితే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710 పరుగులు) ఈరోజు పెద్ద ఇన్నింగ్స్ ఆడితే సూర్యవంశీని దాటేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకునే సువర్ణావకాశం ఉంది. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ కూడా 600 పరుగులతో ఈ సీజన్‌లో అదరగొట్టాడు.

వర్షం పడితే రూల్స్ ఏంటి?

ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంటే ఐపీఎల్ నిర్వాహకులు ప్రత్యేక నిబంధనలను సిద్ధం చేశారు. ఆదివారం మ్యాచ్ పూర్తిగా జరగకపోతే, సోమవారం (జూన్ 1) రిజర్వ్ డేగా ప్రకటిస్తారు. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే తిరిగి ప్రారంభమవుతుంది. ఒకవేళ రెండు రోజులూ వర్షం వల్ల ఒక్క బంతి లేదా కనీసం ‘సూపర్ ఓవర్’ కూడా సాధ్యం కాకపోతే.. లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ను విజేతగా ప్రకటిస్తారు.

మరి ఈ రాత్రి జరిగే బిగ్ ఫైట్‌లో రబడా పర్పుల్ క్యాప్ పట్టు నిలుపుకుంటాడా? లేక భువీ మ్యాజిక్ చేసి క్యాప్‌తో పాటు ఆర్సీబీకి రెండోసారి కప్పు అందిస్తాడా? అనేది చూడాలి!

Leave a Reply