Video Call Suicide I వీడియో కాల్‌లో మాట్లాడుతూనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య
Video Call Suicide I వీడియో కాల్‌లో మాట్లాడుతూనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య
- పెట్రోల్ పోసుకుని బలవన్మరణం
- చికిత్స పొందుతూ మృతి
Video Call Suicide I శంకరపట్నం, ఆంధ్రప్రభ:
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘంలో ఉద్యోగిగా పనిచేస్తున్న బొజ్జ మహేందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సంఘంలో తనపై పెరుగుతున్న ఒత్తిడితో మనస్తాపానికి గురైన మహేందర్ సోమవారం ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
వివరాల ప్రకారం.. కరీంపేట్ గ్రామానికి చెందిన మహేందర్, తాడికల్ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వాహణ అధికారి పోలు వీరస్వామికి వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న సమయంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహేందర్‌ను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న మహేందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆత్మహత్యపై పలు అనుమానాలు
మహేందర్ ఆత్మహత్యకు ముందు సంఘ సీఈవోతో వీడియో కాల్‌లో మాట్లాడటం, అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వివిధ కోణాల్లో చర్చించుకుంటున్నారు.
అందరితో ఆప్యాయంగా మెలిగే మహేందర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమని గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ మృతికి సంతాపం తెలుపుతూ, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
