సర్.. నూరు శాతం పూర్తి చేశాం..
- జిల్లాలో 17,13,445 మంది ఓటర్ల వివరాలు డిజిటైజేషన్
- పారదర్శకంగా ముగిసిన డిజిటైజేషన్ /ఆన్లైన్ ప్రక్రియ
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో కీలక ప్రక్రియైన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మొత్తం 17,13,445 మంది ఓటర్లకు సంబంధించి పారదర్శకంగా డిజిటైజేషన్/ఆన్లైన్ ప్రక్రియ ముగిసినట్లు పేర్కొన్నారు. బీఎల్వోల ఇంటింటి సందర్శనకు ఈసీఐ ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగించినందున కార్యక్రమంలో మరింత పారదర్శకత, కచ్చితత్వానికి సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు.
ఈనెల 31వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురణ ఉంటుందని.. అప్పటి నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలకు వీలుంటుందన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు నోటీసు దశ, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం ఉంటుందని వివరించారు. చివరిగా అక్టోబర్ 3వ తేదీన తుది జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా విశిష్టత స్ఫూర్తితో ప్రతిఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములైనట్లు తెలిపారు.
తిరువూరు నియోజకవర్గంలో 2,08,707 మంది ఓటర్లు, విజయవాడ పశ్చిమలో 2,56,980, విజయవాడ మధ్యలో 2,77,822, విజయవాడ తూర్పులో 2,69,734, మైలవరంలో 2,85,168, నందిగామలో 2,07,481, జగ్గయ్యపేటలో 2,07,553 మంది ఓటర్లకు సంబంధించి 100 శాతం డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
