యువతకు ఉపాధి కల్పించేందుకే స్కిల్ డెవలప్‌మెంట్

గ్రాఫిక్ డిజైన్ శిక్షణ ప్రారంభించిన రామగుండం ఏరియా జీఎం లలిత్ కుమార్

గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు రామగుండం ఏరియా జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ తెలిపారు.

మంగళవారం గోదావరిఖనిలోని సింగరేణి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎంఎస్‌ఎంఈ, డీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో 90 మంది నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న గ్రాఫిక్ డిజైన్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఉద్యోగ అవకాశాలను పొందాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గోదావరిఖనిలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఇప్పటివరకు వేలాది మందికి వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులకు వారి నైపుణ్యాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా సహకారం అందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, ఎంఎస్‌ఎంఈ జాయింట్ డైరెక్టర్ దశరథ్, ఆర్గనైజర్ ఖాన్, శిక్షణా కేంద్రం అధ్యాపకులు, సిబ్బంది, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.