సౌదీలో చిక్కుకున్న భవానిపురం యువకుడికి విముక్తి

  • ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో స్వదేశానికి రప్పింపు
  • భారత రాయబార కార్యాలయం జోక్యంతో సమస్య పరిష్కారం

( భవానిపురం,ఆంధ్రప్రభ ) : ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకున్న విజయవాడ భవానిపురానికి చెందిన యువకుడు శీలం సురేష్‌రెడ్డి ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాడు. విజయవాడ భవానిపురానికి చెందిన శీలం సురేష్‌రెడ్డి పది నెలల క్రితం ఏసీ టెక్నీషియన్‌గా ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అయితే గత నాలుగు నెలలుగా కాంట్రాక్టర్ జీతాలు చెల్లించకపోవడంతో పాటు ఆహారం, వసతి వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా వేధించాడని, స్వదేశానికి తిరిగి రాకుండా అడ్డుకుంటున్నాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని ఆశ్రయించగా, ఆయన వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదించి అవసరమైన చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక చొరవతో సమస్య పరిష్కారమై సురేష్‌రెడ్డి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాడు. స్వదేశానికి వచ్చిన అనంతరం మంగళవారం భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయానికి వెళ్లిన సురేష్‌రెడ్డి, తనకు అండగా నిలిచి స్వదేశానికి రప్పించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.