ఉద్యోగుల వేతనాల కోత అన్యాయం…
ఉద్యోగుల వేతనాల కోత అన్యాయం…
- ఆరోగ్య భద్రత విధి విధానాలు ప్రకటించండి…
- ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉద్యోగులే వారదులు…
- సిద్దిపేట జిల్లా టిఎన్జీవోల సమావేశం..
సిద్దిపేట బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డులపై విధివిధానాలు సక్రమంగా లేకుండానే ఉద్యోగుల మూలవేతనం నుంచి కోత విధించడం సరికాదని సిద్దిపేట జిల్లా టీఎన్జీవోల సంఘం అభిప్రాయపడింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన జిల్లా టీఎన్జీవోల సంఘ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు పరమేశ్వర్, విక్రమ్ రెడ్డిలతో పాటు జిల్లా నలుమూలల నుంచి టీఎన్జీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పలు తీర్మానాలను చేశారు. ప్రభుత్వం హెల్త్ కార్డు విషయంలో స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని, ఆసుపత్రుల జాబితాను వెల్లడి చేయాలని, ఏవైనా సవరణలు ఉంటే పూర్తి చేసిన అనంతరమే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని తీర్మానించారు.
ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్నారని వారిని రక్షించుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన స్థిరీకరణ చేస్తూ 40% ఫిట్మెంట్ ప్రకటించాలని తీర్మానించారు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, నీటిపారుదల శాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయాలని, సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, మరణించిన ఉద్యోగి కుటుంబానికి కారుణ్య నియామకం వద్దనుకుంటే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని తీర్మానించారు.
