రామగుండం చేరుకున్న సింగరేణి చైర్మన్ బుద్ధ ప్రకాష్ జ్యోతి
- “ఖని “ఎల్లందు గెస్ట్ హౌస్ లో డైరెక్టర్లతో భేటీ!!
గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి శుక్రవారం రాత్రి రామగుండం చేరుకున్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా 335 మంది సింగరేణి వారసులకు కారుణ్య నియామక పత్రాలు అందజేయనున్నారు.
ఈ కార్యక్రమం నేపథ్యంలో సింగరేణి చైర్మన్ బుద్ధ ప్రకాష్ తోపాటు కంపెనీకి చెందిన పలువురు డైరెక్టర్లు గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఎల్లందు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. వీరంతా ఇక్కడే బస చేయనున్నారు. ఇది ఇలా ఉండగా కంపెనీ డైరెక్టర్లతో సింగరేణి సీ అండ్ ఎండి ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
కారుణ్య నియామకాల పత్రాల పంపిణీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సింగరేణి చైర్మన్ బుద్ధ ప్రకాష్ తో కలిసి శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన పనితీరు… బొగ్గు ఉత్పత్తి అంశాలను స్వయంగా పరిశీలించనున్నారు.
ఈ క్రమంలో శ్రీరాంపూర్, రామగుండం రీజియన్లకు సంబంధించిన సింగరేణి ఉన్నతాధికారులతో సింగరేణి చైర్మన్ ప్రత్యేకంగా సమావేశమై అక్కడి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మంచిర్యాల శ్రీరాంపూర్ ఏరియాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన అనంతరం సింగరేణి చైర్మన్ బుద్ధ ప్రకాష్ జ్యోతి రామగుండం రీజియన్ లోని బొగ్గు గనులు ఓపెన్ కష్ట ప్రాజెక్టులను పరిశీలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
