9Terrorism | ఆర్మీ శౌర్యానికి ప్రధాని సెల్యూట్
9Terrorism | ఆర్మీ శౌర్యానికి ప్రధాని సెల్యూట్
పాక్ పై దాడులను గుర్తు చేసుకున్న మోదీ
సోషల్ మీడియాలో డీపీలు మార్చిన ప్రధాని, హోం మంత్రి
వార్షికోత్సవం జాతీయ సంకల్పానికి చిహ్నం అన్న భారత సైన్యం
9Terrorism | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’కు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు తమ సోషల్ మీడియా ఖాతాల డిస్‌ప్లే పిక్చర్లను (డీపీ) మార్చారు. గురువారం ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ ఖాతా ప్రొఫైల్ చిత్రాన్ని ఆపరేషన్ జ్ఞాపకార్థం రూపొందించిన చిత్రంతో మార్చగా, ఆయనను అనుసరిస్తూ కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ కూడా తమ డీపీలను మార్చారు. ఆపరేషన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఇది “జాతీయ సంకల్పానికి చిహ్నం” అని భారత సైన్యం పేర్కొంది.
ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. “పహల్గామ్ దాడికి పాల్పడిన ప్రతి ఉగ్రవాదిని, వారిని నడిపించే వారిని భారత్ గుర్తించి శిక్షిస్తుంది” అని ప్రధాని మోదీ గతంలో చేసిన హెచ్చరికను ఈ వీడియోలో పొందుపరిచారు. ఈ ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదంపై తమది జీరో-టాలరెన్స్ విధానమని భారత్ మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసింది. కాగా, “మన సైన్యం చూపిన అసమాన ధైర్యం, సంకల్పం ఉగ్రవాదంపై భారత్ వైఖరిని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఓడించే విషయంలో మా సంకల్పం అచంచలం” అని మోదీ ఉద్ఘాటించారు. రక్షణ రంగంలో మనం సాధించిన స్వావలంబనే నేడు జాతీయ భద్రతకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు.

9Terrorism | సాయుధ దళాల సత్తాకు సెల్యూట్ : రాజ్ నాథ్ సింగ్..

పహల్గాం ఉగ్రదాడికి దీటుగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ వార్షికోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సాయుధ దళాల ధైర్యసాహసాలను కొనియాడారు. ఈ ఆపరేషన్ దేశం దృఢ సంకల్పానికి , సైనిక సన్నద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, భారత సైన్యం చూపిన సమన్వయం , కచ్చితత్వం ఆధునిక సైనిక చర్యలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచాయని ప్రశంసించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ చొరవతో రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న స్వయం సమృద్ధిని కూడా ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని ఆయన అన్నారు.
9Terrorism | నిర్ణయాత్మక సైనిక చర్య..
గతేడాది ఇదే రోజున (మే 6-7, 2025) పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో నిర్ణయాత్మక సైనిక చర్య చేపట్టాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి బాధ్యత తీసుకుంది. దీంతో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మెరుపు వేగంతో చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ జరిగి ఏడాది పూర్తయినప్పటికీ, పాకిస్థాన్‌కు తగిలిన గాయాలు ఇంకా మానలేదు.
గతేడాది మే నెలలో పాక్ భూభాగంలోని 11 కీలక రక్షణ కేంద్రాలు, 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల తాలూకు విధ్వంసం ఏ స్థాయిలో ఉందో తాజా ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అమెరికాకు చెందిన అంతరిక్ష సాంకేతిక సంస్థ వ్యాంటర్ అందించిన హై-రిజల్యూషన్ చిత్రాల ప్రకారం.. పాక్ వైమానిక దళానికి చెందిన 8 కీలక ఎయిర్‌బేస్‌లు భారత్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. భోలారి, మురీద్, సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్, సర్గోధాలోని ముషఫ్, నూర్ ఖాన్, జాకోబాబాద్‌లోని షాబాజ్ బేస్‌లలోని విమాన హ్యాంగర్లు (షెడ్లు), రన్‌వేలు ధ్వంసమయ్యాయి.
9Terrorism | పాక్‌కు చావుదెబ్బ..
విధ్వంసానికి గురైన ఒక్కో నిర్మాణాన్ని పునర్నిర్మించడానికి పాకిస్థాన్‌కు సగటున 6 నుంచి 7 నెలల సమయం పట్టిందని ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని స్థావరాల్లో కనీసం రన్‌వేలకు ప్యాచ్‌వర్క్ చేయడానికి కూడా పాక్‌కు నెలల సమయం పట్టింది. ఏడాది గడిచినా కొన్ని కేంద్రాల్లో ఇప్పటికీ మరమ్మతులు, నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే పాక్ వైమానిక దళం ఇంకా పూర్తిస్థాయి కార్యాచరణలోకి రాలేదని స్పష్టమవుతోంది.
భారత్ ఈ ఆపరేషన్‌లో వాడిన అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాల వల్ల పాక్ రక్షణ కవచాలు నేలమట్టమయ్యాయి. పాకిస్థాన్ తన వైఫల్యాలను బయటి ప్రపంచానికి తెలియకుండా దాచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, శాటిలైట్ చిత్రాలు వారి రక్షణ వ్యవస్థ ఎంతగా కుప్పకూలిందో కళ్ళకు కడుతున్నాయి. కేవలం ఉగ్రవాద స్థావరాలనే కాకుండా, పాక్ సైనిక సామర్థ్యాన్ని కూడా భారత్ ఈ ఆపరేషన్ ద్వారా చావుదెబ్బ కొట్టింది.
CLICK HERE TO READ MORE : 108Seats | గవర్నర్ తీరుపై హీరోల అసహనం!
