పోలీసులకు చిక్కిన సీనియర్ గజదొంగ..
- 25 ఏళ్లుగా చోరీలతో హడలెత్తించిన అంతర్రాష్ట్ర గజదొంగ అరెస్ట్
- మరో ముగ్గురు నిందితులు అదుపులోకి..
- 16 కేసుల్లో చోరీ సొత్తు రికవరీ
- రూ.14.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం
- ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన రూ.17 లక్షల విలువైన 13 తులాల బంగారం రసీదులు సీజ్
- ప్రజలు ఇళ్ల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత 25 ఏళ్లుగా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన అంతర్రాష్ట్ర గజదొంగను శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, 16 చోరీ కేసులను ఛేదించారు. నిందితుల నుంచి రూ.14.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోగా, ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన రూ.17 లక్షల విలువైన 13 తులాల బంగారానికి సంబంధించిన రసీదులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ధర్మవరం పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఇటీవల వరుస ఇంటి చోరీలు జరగడంతో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో మల్లెల వీరాంజనేయులు అలియాస్ గువ్వ, మధు, వడ్డె రామాంజనేయులు (41), సాకే నరసింహులు (30), దేవరకొండ విజయ్, గుజ్జల నారాయణమ్మ ఉన్నారు.

రెక్కీ చేసి.. తాళాలు పగులగొట్టి చోరీలు….
నిందితులు ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా రెక్కీ నిర్వహించి తాళాలు, తలుపులు ధ్వంసం చేసి ఇళ్లలోకి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించేవారని పోలీసులు తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని పలు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి నగదుగా మార్చుకున్నట్లు విచారణలో తేలింది.
ప్రధాన నిందితుడిపై 30 నుంచి 40 కేసులు..
ప్రధాన నిందితుడు మల్లెల వీరాంజనేయులు గత 25 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇతనిపై ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ నంబర్ 749 కొనసాగుతోందన్నారు. ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్, రూరల్, కదిరి, ఎన్పీ కుంట, అనంతపురం, కడప, పులివెందుల, రాయచోటి, ఒంగోలు ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని మధుగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. మొత్తం 30 నుంచి 40 కేసుల్లో ఇతడు ముద్దాయిగా ఉన్నట్లు వెల్లడించారు. సాకే నరసింహులుపై రౌడీ షీట్ నంబర్ 667 అమల్లో ఉందని పేర్కొన్నారు.
రికవరీ చేసిన సొత్తు….
నిందితుల నుంచి సుమారు రూ.14.50 లక్షల విలువైన 11 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన సుమారు రూ.17 లక్షల విలువైన 13 తులాల బంగారానికి సంబంధించిన రసీదులను సీజ్ చేశారు. ఒక ఆటో, నాలుగు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి భద్రతపై ఎస్పీ సూచనలు…
ప్రజలు ఇళ్ల వద్ద నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ( ఎల్ హెచ్ ఎం ఎస్ ) సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇళ్లకు ఐరన్ గ్రిల్స్, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు….
కేసులను వేగంగా ఛేదించి నిందితులను పట్టుకున్న ధర్మవరం టౌన్, రూరల్ సీఐలు ప్రభాకర్, రెడ్డప్ప, ఎస్సైలు రాజశేఖర్, ఉమాదేవి, వీరేష్, క్రైమ్ సీసీఎస్, ఎస్ఓజీ సిబ్బంది, ప్రత్యేక బృంద సభ్యులను జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అభినందించారు.
