KTR | కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ ఫైర్
KTR | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్ర అప్పుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ అప్పులతోనే రాష్ట్రంలో భారీ అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేశామని తెలిపారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని ఆయన ఆరోపించారు. ఒకప్పుడు కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ఎందుకు పడిపోయాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు పథకాన్ని మూడు సార్లు అమలు చేయకుండా రైతులను నిరాశపరిచారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శించారు. రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరచూ ఢిల్లీకి వెళ్తున్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “72 సార్లు ఢిల్లీ వెళ్లి 72 పైసలు కూడా తీసుకురాలేదు” అంటూ వ్యాఖ్యానించారు.
