పారిశుధ్య కార్మికుల సేవలకు సలాం

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన “ప్రజాపాలన-ప్రజా ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు అందించే సేవలు వెలకట్టలేనివని, వారు అంకితభావంతో పనిచేస్తేనే గ్రామాలు ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంటాయని పల్లికొండ సర్పంచ్ దుమాల మమత (రాజు)అన్నారు. సోమవారం మండలంలోని చేంగల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణను పురస్కరించుకుని 11వ రోజు పారిశుధ్య కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,ఎండనక, వాననక గ్రామాన్ని శుభ్రం చేసే కార్మికుల శ్రమను గుర్తించి, వారిని గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రత వెల్లివిరియడం వల్ల వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, ప్రజల ఆరోగ్యంలో కార్మికుల పాత్ర కీలకమని కొనియాడారు.99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి,పారిశుధ్య మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్,వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.