చురుగ్గా సాగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ

ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి గ్రామాన్ని సందర్శించి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడిన తహసీల్దార్ వారి సందేహాలను ఓర్పుగా విని, సంబంధిత అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాళ్ల విజయకుమార్ గౌడ్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలనే ఉద్దేశంతో తహసీల్దార్ స్వయంగా గ్రామానికి రావడం అభినందనీయమన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన పత్రాలతో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.

గ్రామ ప్రజల సౌకర్యార్థం ఎస్‌ఐఆర్ దరఖాస్తు ఫారాలు నింపేందుకు ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో అర్హులైన ఓటర్లకు మార్గదర్శకత్వం అందించడంతో పాటు ఫారాలు నింపడంలో సహాయం చేస్తున్నట్లు చెప్పారు.

ఓటరు జాబితాను పూర్తిగా పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన సవరణలు, చేర్పులు లేదా తొలగింపుల కోసం నిర్దేశిత ఫారాలను సమర్పించాలని సూచించారు. ఓటరు జాబితా శుద్ధీకరణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నీలం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాధాకిషన్ గౌడ్, తహర్, ఎం.బి. మోహన్, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.