Cuba Earthquake | 150 ఏళ్లలో అరుదైన భూకంపం
Cuba Earthquake | 150 ఏళ్లలో అరుదైన భూకంపం
Cuba Earthquake | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా భూకంపాల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఫిలిప్పీన్స్, భూటాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపాల తర్వాత కేవలం గంటల వ్యవధిలోనే క్యూబా, ఇరాన్ దేశాలు కూడా భూప్రకంపనలతో వణికిపోయాయి. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తినష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వివరాల ప్రకారం క్యూబా పశ్చిమ తీరంలో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. పినార్ డెల్ రియో ప్రావిన్స్‌లోని మంటువా పట్టణానికి వాయవ్య దిశలో సముద్ర గర్భంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
దాదాపు 20 సెకన్లపాటు భూమి కంపించడంతో రాజధాని హవానాతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎత్తైన భవనాలు ఊగిపోవడంతో చాలామంది ఇళ్ల నుంచి, హోటళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం ఏమిటంటే.. ఈ భూకంపం టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల్లో కాకుండా ప్లేట్ అంతర్గత ప్రాంతంలో సంభవించడం. 1880 తర్వాత ఈ ప్రాంతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన ప్లేట్-ఇంట్రా భూకంపంగా దీనిని యూఎస్జీఎస్ నిపుణులు పేర్కొన్నారు.
క్యూబాలో వచ్చిన భూకంప ప్రభావం సముద్రం దాటి అమెరికాలోని ఫ్లోరిడా వరకు చేరింది. మియామి, ఫోర్ట్ లాడర్డేల్, ఆర్లాండో ప్రాంతాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా కొన్ని కార్యాలయాలను ఖాళీ చేయించడంతో పాటు రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. మెక్సికోలోని కాంకూన్, టులుం వంటి పర్యాటక ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
