Varanasi | రాజమౌళి ఇంట్రెస్టింగ్ హింట్స్..!
Varanasi | రాజమౌళి ఇంట్రెస్టింగ్ హింట్స్..!
● రామాయణం స్పర్శతో విజువల్ వండర్‌గా మహేష్‌బాబు సినిమా
● తండ్రి–కొడుకుల భావోద్వేగ బంధమే కథకు ప్రధాన బలం
Varanasi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి–సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రపంచ స్థాయి విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ప్రత్యేక మీడియా సమావేశంలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా మంచు ప్రాంతాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో అద్భుతమైన విజువల్స్ ఉండనున్నాయని చెప్పారు. అంతేకాదు, రామాయణ గాథల స్ఫూర్తితో కూడిన అంశాలు కూడా కథలో భాగమవుతాయని వెల్లడించారు. అయితే, ఈ సినిమా కేవలం విజువల్ గ్రాండియర్‌కే పరిమితం కాదని, తండ్రి–కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ బంధమే కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని రాజమౌళి పేర్కొన్నారు. యాక్షన్, అడ్వెంచర్, భావోద్వేగాల సమ్మేళనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.
సుమారు రూ.1,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ అంతర్జాతీయ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రియాంకా చోప్రా కథానాయికగా కనిపించనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

