ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం

ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలం

డీసీసీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి..

కడెం, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మళ్లీ భారీగా రూ.993 పెంచి సామాన్యులపై భారం మోపుతోందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కడెంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడిగెల భూషణ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మల మల్లేష్ యాదవ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.2,078 ఉండగా, ఇప్పుడు రూ.3,071కు చేరిందన్నారు.

ఏకంగా రూ.993 పెంచడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న వ్యాపారులు బతకలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఒక్కసారిగా ఇంతలా ధరలు పెంచడం అన్యాయమని, ఇది పేదోడి పొట్ట కొట్టడమేనని మండిపడ్డారు. హోటల్‌లో టీ రేటు, టిఫిన్ రేటు పెరిగితే కూలీనాలీ చేసుకునేవారు ఎలా తింటారని ప్రశ్నించారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిన్న వ్యాపారులపై ఇది పెనుభారమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ‘అచ్చే దిన్’ అంటే పోయే దినాల్లా చేస్తారని అనుకోలేదని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా, మన దగ్గర మాత్రం గ్యాస్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని నిలదీశారు.

బీజేపీ ప్రభుత్వానికి కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ సామాన్యుడి మీద లేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,200 లోపే ఉండేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ బతకలేని పరిస్థితి తెచ్చాయన్నారు. కమర్షియల్ గ్యాస్‌పై జీఎస్టీని తగ్గించి చిన్న వ్యాపారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధరల నియంత్రణ చేయకపోతే జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ పోరాటం కేవలం కాంగ్రెస్ పార్టీదే కాదని, ప్రతి సామాన్యుడిది, ప్రతి చిరు వ్యాపారిది అన్నారు. దీనికి మహిళా సంఘాలు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు అంతా మద్దతు ఇస్తాయన్నారు. ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ఎండగడుతుందని, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద బెల్లాల్ సర్పంచ్ ఈదుల తిరుపతి, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి మడికే మల్లేష్ యాదవ్, మండల యూత్ అధ్యక్షుడు రెక్కల శ్రీనివాస్ యాదవ్, మాజీ జడ్పీటీసీ తక్కళ్ల రాధా సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే న్యాయవాది రాజేశ్వర్, రమేష్, రాజేశ్వర్ రెడ్డి, ఎంఏ రహీం, కాల్వ తిరుపతి తదితరులు హాజరయ్యారు.

Leave a Reply