Rs.30k | రిజల్ట్​పై.. బిల్లు ఎఫెక్ట్​!

Rs.30k | రిజల్ట్​పై.. బిల్లు ఎఫెక్ట్​!

Rs.30k | ఫలితాలకు.. మెస్ చార్జీలకు లింకు
ఉస్మానియాలో హాస్టల్‌ విద్యార్థులకు షాక్‌
బిల్లుల పేరుతో రిజల్టుల నిలిపివేత
డే స్కాలర్లకు ఫలితాలు అందుబాటులో
పేదలపై 30 వేల ఆర్థిక భారం
విశ్వవిద్యాలయ వైఖరిపై విమర్శలు

Rs.30k | మహబూబాబాద్‌ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెస్‌ బిల్లుల వివాదం విద్యార్థుల భవిష్యత్తుపై మబ్బులు కమ్ముతోంది. మెస్‌ బిల్లులు చెల్లించలేదనే కారణంతో హాస్టల్‌ విద్యార్థుల పరీక్షా ఫలితాలను నిలిపివేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మహబూబాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఈ నిర్ణయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా హక్కును ఆర్థిక అంశాలతో ముడిపెట్టడం పట్ల విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

హాస్టలర్లకు రిజల్టుల నిరాకరణ..
కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిధిలోని పలు కోర్సుల మూడో సెమిస్టర్‌ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే డే స్కాలర్లకు మాత్రమే ఫలితాలు అందుబాటులో ఉండగా హాస్టల్‌ విద్యార్థుల ఫలితాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఒకే పరీక్ష రాసిన విద్యార్థుల మధ్య ఈ తేడా ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హాస్టల్లో ఉండడమే ఇప్పుడు తమకు సమస్యగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభను బిల్లులతో ముడిపెట్టడం అన్యాయమని వారు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ బకాయిల భారం..
మెస్‌ నిర్వాహకులకు ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో సమస్య తలెత్తినట్లు సమాచారం. అయితే ఆ ప్రభావం విద్యార్థులపై పడడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం, నిర్వాహకుల మధ్య ఉన్న సమస్యకు విద్యార్థులను బలిపశువులుగా మార్చడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకకుండా ఫలితాలను నిలిపివేయడం సరైన విధానం కాదని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

30 వేల బకాయిల వివాదం..
చాలా మంది విద్యార్థుల పేర్లపై రూ. 30 వేల వరకు బకాయిలు చూపుతున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ మొత్తం భారంగా మారుతోంది. బకాయిలు చెల్లించకపోతే ఫలితాలు ఇవ్వబోమనే వైఖరి వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. దీని ప్రభావం ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్య ప్రవేశాలు, స్కాలర్షిప్‌లపై పడే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఫలితాలు విడుదల చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

ప్రభుత్వ విశ్వవిద్యాలయంపై ప్రశ్నలు..
ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా ప్రైవేటు కళాశాలలను తలపించే విధానాలు అమలవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ఫలితాలను బిల్లులకు బందీ చేయడం విద్యా స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన సంస్థలే ఆర్థిక ఒత్తిడి తేవడం ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది హాస్టల్‌ విద్యార్థులు ప్రస్తుతం అనిశ్చితిలో ఎదురుచూస్తున్నారు. మెస్‌ బిల్లుల సమస్యను పరిపాలనా స్థాయిలో పరిష్కరించి ఫలితాలను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.