ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద..
- 18 గంటల వర్షానికి 75 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో..
- పార్వతి బ్యారేజీకి 26 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో..
గోదావరిఖని, ఆంధ్రప్రభ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరుగుతోంది. మంగళవారం రాత్రి నుండి సుమారుగా 18 గంటల పాటు కురుస్తున్న విస్తారమైన వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం వరకు 75 వేల 328 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 148 మీటర్ల లెవెల్ కు 144 మీటర్ల లెవెల్ లో నీటి సామర్థ్యం ఉండగా… ప్రస్తుతం శ్రీపాద రిజర్వాయర్లో 11.1108 టీఎంసీలు (శతకోటి ఘనటపు అడుగులు) నీరు నిల్వ ఉంది.
ఇదిలా ఉండగా, ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కి 255 క్యూసెక్కుల నీరు, రామగుండం ఎన్టిపిసి థర్మల్ విద్యుత్ కేంద్రానికి కూడా నేటి సరఫరా చేపడుతున్నారు. అలాగే నంది మేడారం కు చెందిన పంప్ హౌస్ లో నుండి మిడ్ మానేరు కు 12600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. 36 గంటల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అదేవిధంగా సుందిళ్ల పార్వతి బ్యారేజ్ కి 26వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుంది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిళ్ల పార్వతి బ్యారేజ్, గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రభావిత గ్రామాల ప్రజలను నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి వివరాలను ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫ్లాట్ మానిటరింగ్ ద్వారా విడుదల చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్, మంచిర్యాల మున్సిపాలిటీకి తాగునీటి కోసం నీటి సరఫరా యధావిధిగా జరుగుతుంది.
