మహిళా రిజర్వేషన్లో సామాజిక న్యాయం పాటించాలి..

మహిళా రిజర్వేషన్లో సామాజిక న్యాయం పాటించాలి..
దళిత క్రైస్తవుల తీర్పును పునర్ సమీక్షించాలి
వారి రిజర్వేషన్లు నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : దేశంలో మహిళల రాజకీయ భాగస్వామ్యం కోసం ఉద్దేశించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కేటాయించి సామాజిక న్యాయం అమలు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) జిల్లా కార్యదర్శి దేవి పోచన్న డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో డీహెచ్‌పీఎస్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక వర్గాల వారీగా వాటా కేటాయించకుంటే రిజర్వేషన్ బిల్లు అసలు లక్ష్యం నెరవేరదని హెచ్చరించారు. అలాగే మతం మారిన కారణంతో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, వారి రిజర్వేషన్లపై ఉన్న తీర్పులను పునర్ సమీక్షించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామన్నారు.
రాష్ట్ర నాయకులకు సన్మానం..
వరంగల్‌లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దేవి పోచన్న, రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నికైన మామిడి గోపి, బొల్లం తిలక్ అంబేద్కర్ లను సీపీఐ ప్రజాసంఘాల నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, గుండా మాణిక్యం, రత్నం రాజన్న, బొంకూరి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
