AP | ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలి: ఏపీ ఎన్జీజీవో సంఘం

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ఎన్జీజీవో సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.వి. శివారెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాలు మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది..

ఈ సమావేశంలో ఏపి ఎన్జీజివో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. విద్యాసాగర్ ను రాష్ట్ర జెఎసి డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోనే గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు.

ప్రభుత్వంతో ఇప్పటివరకు సామరస్య పూర్వకంగా వివరించిన తమ ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూసామన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లలో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై జేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో చర్చించామన్నారు.

ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని, ఉద్యోగులను కూడా ప్రజలలో భాగంగా గుర్తించాలన్నారు. వారి సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట ఒకటవ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లించడం తప్పితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు కలగలేదని తెలిపారు. ఇంతకుమించి ఇంకొక అడుగు కూడా పడలేదన్నారు.

ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ వేతన సవరణ గడువు జులై 2023 నుంచి మొదలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించారని, కానీ వేతన సవరణ కమిటీ చైర్మన్ గత సంవత్సరం రాజీనామా చేసినప్పటికీ, గడువు ముగిసి రెండు సంవత్సరాలు కావస్తున్నాయని, ఇంతవరకు పిఆర్సి కమిటీ చైర్మని నియమించకపోవడం శోచనీయం అని, వెంటనే పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు తీరని నష్టం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 25 వేల కోట్ల రూపాయలు బకాయిలను మిగిల్చి వెళ్లిందని, ఏపీ జిఎల్ఐ సంబంధించి ఉద్యోగుల డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకొని ఉద్యోగులకు చెల్లింపు చేయకపోవడం వలన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదని కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే జిపిఎఫ్, సరెండర్ లీవ్ బకాయిలు సంక్రాంతికి విడుదల చేశారని వివరించారు.జిపిఎఫ్/ఏపీ.జి.ఎల్.ఐ/సరెండర్ లీవ్ ల బకాయిల చెల్లింపు విషయములో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, బకాయిల త్వరితగతిన చెల్లించాలని, బకాయిల చెల్లింపులపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు.

ముఖ్యంగా జి.పి.ఎఫ్/ఏపి.జి.ఎల్.ఐ లో ప్రభుత్వం డబ్బు ఒక్క రూపాయి కూడా లేదన్నారు. మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యమేనన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయిల ఉద్యోగులు దాచిపెట్టుకున్న సొమ్ము ప్రభుత్వం దగ్గర వుందని, పదవీవిరమణ, రుణ మంజూరుపై నిధులు విడుదల చేయక పోవడం దురదృష్టమని తెలిపారు.పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందని 30 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడంలేదని కనీసం ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితులలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ, డిపార్ట్మెంట్ చుట్టూ తిప్పించుకోవడం భావ్యం కాదని వారికి ప్రాధన్యత క్రమంలో చెల్లించాలని కోరారు.

ఏపీ. జి.ఎల్. ఐ లో 1100 కోట్ల రూపాయిల బకాయిలు ఉన్నాయని, ఈ సంవత్సర కాలంలోనే 1200 కోట్ల వరకు ఉద్యోగులు ప్రభుత్వానికి చెల్లించారని, 14000 కోట్లు ఉద్యోగుల మూలధనం ప్రభుత్వం వద్ద ఉన్నారని, ఉద్యోగి చనిపోయిన డబ్బులు వచ్చే పరిస్థితి లేదని, ఇటువంటి దురదృష్టకర పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి తక్షణమే చెల్లింపులకు మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *