పుట్రేల దళితవాడలో నీటి సమస్యకు పరిష్కారం

  • ప్రజల విజ్ఞప్తితో తక్షణమే బోరు తవ్వకాలకు శ్రీకారం..
  • స్థానికుల ఇబ్బందులపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
  • బోరు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే..
  • గ్రామస్థుల్లో హర్షం
  • తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యమని వెల్లడి

(విస్సన్నపేట, ఆంధ్రప్రభ) : విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామం నార్త్ దళితవాడలో చాలాకాలంగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న నీటి ఇబ్బందులను మార్కెట్ యార్డు చైర్మన్ కొలికపోగు బాలా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నీటి బోరు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసి, స్వయంగా కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, తాగునీరు, సాగునీటి సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటికి తక్షణ పరిష్కారం చూపించడానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. బోరు ఏర్పాటు పూర్తయితే దళితవాడలోని కుటుంబాలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించడంతో పాటు స్థానిక రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే గుర్తించి బోరు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తిరువూరు పట్టణ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.