ఆర్టీసీ సమ్మె ప్రభావం… రోడ్డెక్కని బస్సులు

ఆర్టీసీ సమ్మె ప్రభావం… రోడ్డెక్కని బస్సులు

విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు
అవస్థలు పడ్డ ప్రయాణికులు

తొర్రూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మె కొనసాగింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.దీంతో బస్ డిపోలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపో వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు చోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. కార్మికుల సమ్మెతో తొర్రూరులో 93 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం తెల్లవారుజాము నుంచి ఆందోళన చేపట్టారు.తొర్రూరు డిపోలో 51 ఆర్టీసీ, 43 అద్దె బస్సులు ఉండగా 93 బస్సులు డిపోకే పరిమితం కాగా.. కేవలం ఒక అద్దె బస్సు మాత్రమే నడిచింది.సందెట్లో సడేమియాలాగా ప్రైవేటు వాహనదారులు ప్రయాణికుల నుంచి ఇష్టాను రీతిలో చార్జీలు వసూలు చేశారు.ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జిలుకర యాదగిరి మాట్లాడుతూ…ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికైనా మొదలు పెట్టాలన్నారు.

కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని, నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని, ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోతే.. మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. ఆర్టీసీని హైదరాబాద్ లో లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, ఆర్టీసీ సమ్మె న్యాయబద్ధమైందని తెలిపారు.

Leave a Reply