రెండేళ్ల బాధకు ముగింపు..

రెండేళ్ల బాధకు ముగింపు..

మేడ్చల్, ఆంధ్రప్రభ : ఎన్నో ఆసుపత్రుల చుట్టూ రెండేళ్లుగా తిరిగినా నయం కాని అరుదైన ఆరోగ్య సమస్యను మేడ్చల్‌లోని మెడిసిటీ ఘన్‌పూర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా పరిష్కరించారు. ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన ఎముక ముక్కను అత్యాధునిక శస్త్రచికిత్స ద్వారా తొలగించి, రోగికి పూర్తి ఉచితంగా వైద్యం అందించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన రైతు రామ నరసయ్య గత రెండేళ్లుగా తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినా సమస్య తగ్గకపోవడంతో ఆస్తమాగా భావించి మందులు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో బంధువుల సలహాతో రోగి మెడిసిటీ ఆసుపత్రిని ఆశ్రయించాడు. పల్మనాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ శైలజ నేతృత్వంలో, ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ. రాకేష్ రెడ్డి బృందం రోగికి అత్యాధునిక పరీక్షలు నిర్వహించింది.

సీటీ స్కాన్ నివేదికలో ఊపిరితిత్తుల్లో చిన్న ఎముక ముక్క చిక్కుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై రోగిని ప్రశ్నించగా.. రెండేళ్ల క్రితం మాంసాహారం తీసుకున్న తర్వాత నుంచే ఈ సమస్య ప్రారంభమైనట్లు వెల్లడించాడు.

సమస్య తీవ్రతను గుర్తించిన వైద్య బృందం ‘ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ’ విధానం ద్వారా ఊపిరితిత్తుల్లోని ఎముక ముక్కను సురక్షితంగా తొలగించింది. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి దీర్ఘకాలిక బాధ నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లో సమస్యకు అసలు కారణాన్ని గుర్తించడం క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. అత్యంత సంక్లిష్టమైన ఈ చికిత్సను పూర్తి ఉచితంగా అందించడం ఆనందంగా ఉందన్నారు.

రూపాయి ఖర్చు లేకుండా చికిత్స చేసి ఆరోగ్యాన్ని తిరిగి అందించిన మెడిసిటీ వైద్యులకు, ఆసుపత్రి యాజమాన్యానికి రామ నరసయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply