పోలీస్ పెట్రోలింగ్ వాహనంపై రీల్స్…
- ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌లో రీల్స్ వివాదం – వీడియో వైరల్
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువకుడు పోలీస్ పెట్రోలింగ్ వాహనం పై కూర్చొని రీల్స్ తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వివాదం రేగింది. శాంతి భద్రతల కోసం ప్రభుత్వం అందించిన అధికారిక వాహనాన్ని ఇలా వినియోగించడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తూ పోలీసుల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియో స్టేషన్ ముందు తీసినట్లుగా కనిపించడం, అది ఎప్పుడు జరిగినదన్న వివరాలు స్పష్టంగా తెలియకపోయినా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా పోలీసు అధికారులు అత్యంత తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
ఈ వివాదంపై ఆంధ్రప్రభ అడిగిన ప్రశ్నలకు ఎస్సై రమేష్ స్పందిస్తూ… మూడు నెలల క్రితం వర్షాకాలంలో పోలీస్ స్టేషన్ భవనంపై చెత్త పెరిగిపోవడంతో, మెట్టు లభ్యం కాక వాహనంపై నుంచి పైకెళ్లి చెత్త తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో అక్కడి అకతాయిలు వీడియో తీర్చి ఇప్పుడు వైరల్ చేస్తున్నారని తెలిపారు.
ఈ ఘటనపై విపులమైన విచారణ ప్రారంభించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ స్పష్టం చేశారు.
